News

Realestate News

అంగరంగ వైభవంగా అమ్మవారి ఆగమనం

అంగరంగ వైభవంగా అమ్మవారి ఆగమనం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వందేళ్లకు పైగా కొనసాగుతున్న ఒక సంస్కృతి.. ప్రసిద్ధ పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం నుంచి రెండేళ్లకోసారి మూలమూర్తులు జగ్గయ్యపేట పట్టణానికి తరలివచ్చే ఆనవాయితీ… ఈ నేపథ్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఆగమనం పట్టణ వాసులకు కనువిందు చేసింది. ఉదయం 11 గంటలకు చిల్లకల్లు మీదుగా పట్టణ శివార్లలోకి ప్రవేశించిన పరివార సమేత గోపయ్య, తిరుపతమ్మల బండ్లకు అన్ని వర్గాల ప్రజలు నీరజనాలు పలికారు. విజయవాడ రోడ్డులోని మినీ బైపాస్‌ రోడ్డు వైఎస్‌ఆర్‌ చౌక్‌ వద్ద నాయకులు, అధికారులు ఎదురేగి అమ్మవారి బండ్లకు స్వాగతం పలికారు. రథాల వెంట వచ్చిన పెనుగంచిప్రోలు ఆలయ పాలకవర్గం, అధికారులు, ప్రముఖులకు అభినందనలు తెలుపుతూ అమ్మవారి రథం సహా 9 రథాలను తోడ్కొని వెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన బండ్లలో వరుసగా తిరుపతమ్మ, గోపయ్యల మూలమూర్తులు, ఉత్సవ మూర్తులు, ఉన్న ఊరు అంకమ్మ, వినుకొండ అంకమ్మ, చంద్రమ్మ, మల్లయ్య, పెద్దమ్మ, మద్దిరావమ్మ, పులి(జేష్ఠాదేవి) ప్రతిమల వెంట భక్తులు భజనలు, భక్తి గీతాలు, డప్పులు, సన్నాయి మేళాలు, కోలాట నృత్యాలతో పట్టణంలోనికి తోడ్కొని వచ్చారు.

అలయ చైర్మన్‌ కర్ల వెంకటనారాయణ, ఈఓ రఘునాథ్‌లు సహా ఆలయ ప్రతినిధులు వెంట రాగా తోటి విగ్రహాలతో పాటు భక్త పరివారంగా అమ్మవారి ఆగమనం అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహాలకు, రథాలకు పూలవర్షంతో తోడ్కొని రావడంతో పట్టణ వీధులు పూలమయంగా మారాయి. మాజీ ఛైర్మన్‌ నూతలపాటి చెన్నకేశవరావు, ఉప సర్పంచి చింతల సీతరామయ్య తదితర ప్రముఖులు రథాల వెంట వచ్చారు. స్వాగతం పలికిన వారిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంటూరి చిన్నా, నెట్టెం శివరాం, శ్రీరాం చినబాబు, రంగుల ఉత్సవ కమిటీ ఆకుల శ్రీకాంత్‌, శ్రీధర్‌, భువనగిరి గణేష్‌, ఆచంట సతీష్‌, మొరిశెట్టి హరిలాల్‌, పతంగి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, మీసాల గాంధీÅ, మీసాల విజయ్‌, తుమ్మల గంగారావు, మరువాడ ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.

కొలువు దీరిన తిరుపతమ్మ, గోపయ్యలు
రంగుల ఉత్సవం కోసం తరలి వచ్చిన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్యల మూలమూర్తులు.. పరివార దేవతా సమేతంగా నూతనంగా నిర్మించిన రంగుల ఉత్సవ మండపంలో కొలువు తీరారు. స్థానిక రంగు బజార్‌లోని నూతనంగా నిర్మించిన ఈ మండపంలోనికి విగ్రహాలను పూల వర్షంతో తోడ్కొని వచ్చారు. ప్రధాన వీధి వరకు రథాల్లో వచ్చిన విగ్రహాలను అర్చకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పోలీస్‌ బందోబస్తు నడుమ మండపానికి చేర్చారు.

అమ్మవారికి ఘన స్వాగతం
ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేట శివార్లకు చేరుకున్న లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్యల మూర్తులకు మూడు గంటలపాటు పట్టణ వీధుల్లో అడుగడుగు భక్తులు నీరాజనాలు పలికారు. దారి పొడవునా బిందెలతో ఎడ్డబండ్ల రథాలకు మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపులో వాగ్ధేవి, జేఆర్‌సీ విద్యార్థులు రహదారికి ఇరువైపులా నిలిచి పూలవర్షం కురిపించారు. తిరుపతమ్మ దీక్షా భక్తులు, గోపయ్య స్వాములు భజనలు చేస్తూ ఊరేగింపుగా వెంటసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *