News

Realestate News

అబ్బురపరిచిన సన్నాహక విన్యాసాలు..!

అబ్బురపరిచిన సన్నాహక విన్యాసాలు..!

ఎయిర్‌షోకు ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు

విజయవాడకు చేరుకున్న విమానాలు

ఈనాడు, అమరావతి

కృష్ణానది తీరప్రాంతం.. సమయం..సరిగ్గా ఉదయం 11.30.. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఆకాశంలో నాలుగు విమానాలు రివ్వున దూసుకువచ్చాయి. ఆకాశంలో చక్కర్లు కొట్టాయి… గిరికీలు తిరిగాయి.. పల్టీలు కొట్టాయి.. రంగుల దట్టమైన పొగను జాతీయ పతాకం తరహాలో విడుదల చేశాయి. దాదాపు 15 నిమిషాల సేపు చక్కర్లు కొట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో అంతుబట్టక తదేకంగా జనం వాటివైపే ఆశ్చర్యంగా చూశారు. అనుభూతిని పొందారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఎయిర్‌షోకు సన్నాహక విన్యాసాలు చేసిన దృశ్యాలు ఇవి. మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరిన నాలుగు చిన్న విమానాలు ఆకాశంలో 15 నిమిషాల సేపు విన్యాసాలను ప్రదర్శించారు. ఈనెల 12 నుంచి మూడు రోజుల పాటు కృష్ణా తీరంలో ఎయిర్‌షో జరుగనున్న విషయం తెలిసిందే.

దీనికి మంగళవారం ట్రయల్‌రన్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఎయిర్‌షోకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా తీరంలోని పున్నమి, భవానీ ఘాట్‌ల నుంచి ప్రేక్షకులు విమానాల విన్యాసాలను తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో విన్యాసాలు జరుగనున్నాయి. ఈనెల 14 వరకు నిర్వహిస్తారు. విమానాలకు కావల్సిన ఇంధనం గన్నవరం విమానాశ్రయంలో నింపుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు గన్నవరం విమానాశ్రయంలో సిద్ధం చేశారు. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇలాంటి ఎయిర్‌షోలు నిర్వహించారు. నవ్యాంధ్రలో తొలిసారిగా వీటిని విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఆకాశంలో దాదాపు రెండు మూడు కిలోమీటర్ల ఎత్తులో. కిందకు పలు విన్యాసాలు విజయవంతంగా చేశారు.

చురుగ్గా ఏర్పాట్లు..!
ఈ విన్యాసాలకు 50వేల మంది పైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీ ఘాట్‌ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టరు గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమీషనరు జి.వీరపాండియన్‌, విజయవాడ సబ్‌కలెక్టరు సలోని సిదాన, డీసీపీలు పాలరాజు, కాంతిరాణా టాటాలు పరిశీలించారు. స్థలం మొత్తం చదును చేయాలని సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల మళ్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12న విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం భవానీ ఘాట్‌ వద్ద ఎయిర్‌షోలో పాల్గొంటారు. ఈనెల 12న సాయంత్రం 4.30గంటల నుంచి 4.45 వరకు ఎయిర్‌షో నిర్వహిస్తారు. 13 వతేదీన ఉదయం 11గంటల నుంచి 11.15 వరకు తిరిగి సాయంత్రం 4.30గంట నుంచి 4.45 వరకు జరుగుతుంది. 14 తేదీన కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో విన్యాసాలు ప్రదర్శిస్తారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రేక్షకుల కోసం మంచినీరు ఏర్పాటు చేయనున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలను కూడా నగర పాలక సంస్థ తీసుకుంది. బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎయిర్‌షో తిలకించేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని సంయుక్త కలెక్టరు గంధం చంద్రుడు చెప్పారు. ఎయిర్‌ షో సందర్భంగా పున్నమిఘాట్‌ వద్ద యువ, క్రీడావిధానంపై చర్చాగోష్ఠులు నిర్వహించేందుకుఏర్పాట్లు చేస్తున్నట్లు జేసీ చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *