News

Realestate News

ఇస్కాన్‌.. పర్యటక ఐకాన్‌

ఇస్కాన్‌.. పర్యటక ఐకాన్‌

జూన్‌కు తొలిదశ పూర్తయ్యేలా ప్రణాళిక

కొండవీడు పరిసరాలకు కొత్త అందాలు

ఈనాడు, గుంటూరు

నవ్యాంధ్ర రాజధాని సమీపాన కొండవీడు కొండల ప్రకృతి అందాల మధ్య.. రమణీయతకు దర్పణం పట్టే రంగు రంగుల పూల తోటలతో.. ఆధ్మాత్మికత వెల్లివిరిసేలా   రూపుదిద్దుకుంటున్న ఇస్కాన్‌ ఆలయం ఆహ్లాదాన్ని పంచే పర్యటకానికి ప్రతిమ(ఐకాన్‌)గా నిలువనుంది.

ప్రముఖ పర్యటక ప్రాంతం కొండవీడు సమీపాన జూన్‌ నాటికి తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ఆలయ పనులను ఇస్కాన్‌ నిర్వహిస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో స్వర్ణ హంస మందిర నిర్మాణం కొలిక్కి రాగా ఇప్పటికే 108 మండపాలు సిద్ధమయ్యాయి. ప్రధాన ఆలయ పనులు జరుగుతున్నాయి. మానవ పుట్టుక నుంచి ఇప్పటివరకు వివిధ దశలకు సంబంధించి ఇతివృత్తాలను చిత్రాల రూపంలో సందర్శకులకు వివరించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. పశ్చిమబంగ నుంచి వచ్చిన కార్మికులు బొమ్మల తయారీలో నిమగ్నమయ్యారు.

రాజస్థాన్‌ నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాయితో నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వ్యక్తి తనకు తాను ఉపయోగపడుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేందుకు ఇస్కాన్‌ ఆలయం నిర్మితమవుతోంది. ఇక్కడే ఆవులపై పరిశోధన కేంద్రం, విశ్వవిద్యాలయం, ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఆవులపై పరిశోధనలు చేసి ఈ ప్రాంతంలో వాటి సంతతి పెరగడానికి చర్యలు చేపట్టనున్నారు. ఆలయం ప్రారంభమైతే ఇక్కడ పర్యటకంగా ప్రగతి పట్టాలెక్కనుంది.