News

Realestate News

నేడు ఇంద్రకీలాద్రిపై ‘విజయీభవ’

నేడు ఇంద్రకీలాద్రిపై ‘విజయీభవ’

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: సరస్వతి దేవి జన్మదినమైన శ్రీపంచమిని పురస్కరించుకొని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ‘విజయీభవ’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న (నేడు) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను విద్యార్థుల కోసం సరస్వతి దేవిగా అలంకారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడు సంవత్సరాలుగా సరస్వతి దేవి జన్మదినమైన శ్రీపంచమి నాడు మూలవిరాట్టు దుర్గమ్మకు సరస్వతి దేవిగా అలంకారం చేస్తున్నారు. భారీగా విద్యార్థులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 5 గంటల వరకు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విద్యార్థులు ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.

ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే ప్రతి విద్యార్థి యూనిఫాంతో పాటు గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. దర్శనానంతరం ప్రతి విద్యార్థికి శక్తి కంకణం, అమ్మవారి ఫొటో, కలం, చిన్నలడ్డ్డూ ప్రసాదం, కుంకుమ అందజేయాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్యాకెట్లను సిద్ధం చేశారు. 20 వేల మంది విద్యార్థులకు అవసరమైన కలాలను అధికారులు దాతల సహకారంతో అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.