News

Realestate News

పరుగుతో ఆరోగ్యం

vijayawada real estate news

పరుగుతో ఆరోగ్యం
అమరావతి మారథాన్‌కు సన్నాహాలు
ఈసారి రూ.20 లక్షల నగదు బహుమతి
ఈనాడు, అమరావతి

ఆరోగ్యం.. ఆనందం.. ఉత్సాహం మేళవించిన ‘జియో అమరావతి మారథాన్‌’ మళ్లీ వచ్చేసింది. దేశవిదేశాల నుంచి పరుగుల వీరులు అమరావతి బాట పట్టే రోజు మరో నాలుగు రోజుల్లో రానుంది. గత ఏడాది నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరుగుల వేడుకకు ఈ ఏడాది సైతం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో పరుగులు తీసే అభివృద్ధితో పాటూ ఏటేటా మారథాన్‌లోనూ పరుగులు పెట్టి.. ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలనేది లక్ష్యం.

దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక మారథాన్‌ ఉన్నట్టే అమరావతికీ ఏర్పడింది. ఈనెల 8న నిర్వహించబోయే అమరావతి మారథాన్‌ దేశంలోనే మొదటిది. ఇప్పటికే పరుగులో పాల్గొనేందుకు ఆరు వేల మంది నమోదు చేయించుకున్నారు. వెయ్యి మంది వరకూ వలంటీర్లు ముందుకొచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం వేదికగా జియో అమరావతి మారథాన్‌ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విజయవాడ నగరపాలక సంస్థ, డిసీజ్‌ ఎరాడికేషన్‌ త్రూ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రివెన్షెన్‌(డీఈఈపీ) స్వచ్ఛంద సంస్థ, రిలయన్స్‌ జియో సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.

నాలుగు విభాగాలుగా…
అమరావతి మారథాన్‌ను నాలుగు విభాగాలుగా వేర్వేరుగా చేపడతారు.. హాఫ్‌మారథాన్‌(21కిలోమీటర్లు), 10కె, 5కె, 3కె రన్‌లను నిర్వహిస్తున్నారు. బహుమతులను కూడా వేర్వేరుగానే అందిస్తారు. ఈసారి రూ.20 లక్షల నగదు బహుమతులను అందిస్తున్నారు. ‌్ర హాఫ్‌మారథాన్‌: ఇందిరాగాంధీ స్టేడియం ముందు నుంచి పోలీస్‌ కంట్రోల్‌రూం, పైవంతెన, నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రకాశం బ్యారేజీ మీదుగా మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకూ వెళ్లి వెనుదిరిగి వస్తారు.

దేశంలో జరిగే మారథాన్‌లలో పాల్గొనే ప్రముఖ క్రీడాకారులు దీనిలో ఉంటారు. ‌్ర 10కె రన్‌: ఇందిరాగాంధీ మైదానం వద్ద నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీ చివరి వరకూ ఐదు కిలోమీటర్లు వెళ్లి తిరిగి ప్రారంభమైన చోటకు చేరుకుంటారు. ‌్ర 5కె రన్‌: ఇందిరాగాంధీ మైదానం నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూం వరకూ వెళ్లి తిరిగి వస్తారు. ‌్ర 3కె రన్‌: ఇందిరాగాంధీ మైదానం నుంచి ఎంజీరోడ్డుపై ఉన్న ఠాగూర్‌ గ్రంథాలయం వరకూ వెళ్లి వెనుదిరుగుతారు. విజయవాడ నగరంలోని పాఠశాలల నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ బాబు.ఎ, నగరపాలక సంస్థ కమిషనర్‌ వీరపాండ్యన్‌లు సమావేశం ఏర్పాటు చేసి మారథాన్‌ గురించి వివరించారు. పిల్లలను పాల్గొనేలా చేయాలని సూచించారు.

అందరికీ పతకం, ధ్రువపత్రం..
మారథాన్‌లో పాల్గొనే వారందరికీ ప్రత్యేకంగా పతకాలు, ధ్రువపత్రాలను అందిస్తారు. దీనికోసం ముందే ఏర్పాట్లు చేశారు. 15వేల మంది ఈసారి హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగానే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నాలుగు విభాగాల్లో దేనిలో పాల్గొనాలనుకుంటున్నారో.. ముందే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు.- www.amaravatimarathon.run లోకి వెళ్లి నమోదు చేయించుకోవాలని నిర్వాహకులు, డీప్‌ సంస్థ ఫౌండర్‌ డాక్టర్‌ మధు తెలిపారు. నేరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఇందిరాగాంధీ మైదానంలోని స్పోర్ట్స్‌ అథారిటీని సంప్రదించాలి. నమోదు చేసుకున్న వారికి 6, 7వ తేదీల్లో దండమూడి రాజగోపాల్‌ మున్సిపల్‌ మైదానంలో ప్రత్యేక మారథాన్‌ కిట్లను అందిస్తారు.