News

Realestate News

పల్లె వాకిట ఇలా వ్యాపారం

పల్లె వాకిట ఇలా వ్యాపారం
ప్రోత్సాహకాలుఅందిస్తున్న ఆన్‌లైన్‌
వ్యాపార సంస్థలువినియోగించుకుంటున్న యువత
ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థల సేవలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. ఆయా సంస్థలు గ్రామాల్లో యువకులను విక్రయదారులుగా (సెల్లర్లు).. ప్రచారకర్తలుగా (ప్రమోటర్లు) నియమించుకొని తమ సేవలను విస్తరించుకుంటున్నాయి. ఆ సేవలు అందించేందుకు కొంత మొత్తంలో వారికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా యువత ఇంటి వద్ద నుంచే ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, బ్రౌజింగ్‌ చేసే సత్తా ఉన్న వారితో పాటు చిన్న వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉన్న వారిని ఇందులోకి ఆహ్వానిస్తున్నాయి. ఫలితంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు ఆన్‌లైన్‌ వస్తువులు అందుతున్నాయి. యువతకు ఉపాధి కూడా లభిస్తోంది.
వివిధ రకాలుగా..
ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లను, యాప్‌లను తరచూ చూసే వారిని, వివిధ వస్తువులు కొనుగోలు చేసే వారిని ఆయా సంస్థలే గుర్తిస్తున్నాయి. తమ సంస్థ తరుపున పని చేయడానికి అవకాశం కల్పిస్తామని, ఉత్పత్తులను విక్రయించేందుకైనా.. ప్రచారం చేయడానికైనా ఆసక్తి ఉంటే వివరాలు పంపించాలని మెయిల్‌ ద్వారా కోరుతున్నాయి. అలా చేరిన వ్యక్తికి వివిధ రకాలుగా కమీషన్‌ అందించి ప్రోత్సహిస్తున్నాయి. కమీషన్‌ను నేరుగా అతని బ్యాంకు ఖాతాలోనే వేస్తున్నాయి. కమీషన్‌తో పాటు కొన్ని ఓచర్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఆయా ఆన్‌లైన్‌ షాపింగ్‌ల వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓచర్‌లోని వివరాలు నమోదు చేసుకొని మరికొన్ని వస్తువులను కొనుగోలు చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థల యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇతరులకు లింకులు పంపి వారు సైట్‌లోకి వెళ్లి కొనుగోలు చేసినా, యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని కొన్నా మొదటి వ్యక్తికి కమీషన్‌ వస్తుంది. ఒక వేళ లింక్‌ ద్వారా మూడో వ్యక్తి బ్రౌజింగ్‌ చేసి వస్తువులు కొనుగోలు చేస్తే మొదటి వ్యక్తికి కమీషన్‌ వర్తిస్తుంది. ఆయా సంస్థలు ఇచ్చే రాయితీలు, ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా ప్రకటనలు తయారు చేసి ప్రసార మాధ్యమాల్లో పెట్టి ప్రచారం కల్పించిన వారికి కూడా ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులకు ప్రచారం చేయడంతో పాటు వారి చేత కొనుగోలు చేయించినా లాభం వస్తుంది.

తక్కువ ధరకే….
ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు ఆ సంస్థ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లి వస్తువును ఎంపిక చేసుకుంటాడు. తాను ఎంచుకున్న వస్తువు ధరను ఆ మార్కెటింగ్‌ సంస్థలో ఉన్న ఏ విక్రయదారుడు తక్కువకు ఇస్తాడో చూస్తాడు. అతని వద్దే కొనుగోలు చేస్తాడు. అలా ఎక్కువ మంది అమ్మకందార్లను షాపింగ్‌ సంస్థ ఆహ్వానించి తమ సంస్థ ద్వారా అమ్మే వస్తువు వినియోగదారునికి అతి తక్కువకే లభించేలా చూస్తోంది. దీనిని మార్కెటింగ్‌ భాషలో సెల్లార్‌ వ్యవస్థ అంటారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు గతంలో అతి పెద్ద దుకాణాలకు, కంపెనీలను ప్రాంచైజీలుగా తీసుకుని వ్యాపారం చేసేవి. ప్రస్తుతం వ్యాపారాన్ని విస్తృత పరిచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని ఆహ్వానించి సెల్లర్‌గా అవకాశమిస్తున్నాయి. ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలకు పట్టణ, నగర ప్రాంతాల్లో వినియోగదారులు ఎక్కువగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటున్నారు. అందుకే పల్లెల్లో వినియోగదారులను పెంచుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.

ప్రచార కర్తలుగా..
ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు విక్రయిస్తున్న వస్తువులు, ఇస్తున్న రాయితీలు, ప్రత్యేకతల గురించి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తుంటాయి. ఆ ప్రచారం పెరగడంతో పాటు కొత్త వినియోగదారుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌లోకి రావడానికి పట్టణ, గ్రామీణ యువతను ప్రచార కర్తలుగా (ప్రమోటర్లు) నియమించుకుంటున్నాయి. ఇలా వ్యాపార పరిధి పెంచుకుంటూనే.. పల్లెల్లో కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆ అవకాశాలను చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *