News

Realestate News

పుస్తక పండగొచ్చింది

పుస్తక పండగొచ్చింది

ఈనాడు- విజయవాడ

విజయవాడలో ఏటా జనవరి నెలలో రెండు పండగలు ఉంటాయి. ఒకటి సంక్రాంతి అయితే.. అంతకంటే ముందొచ్చే మొదటి పండగ విజయవాడ పుస్తక మహోత్సవం. గత 28 ఏళ్లుగా నిర్విరామంగా ఏర్పాటు చేస్తున్న పుస్తక మహోత్సవంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు, నిర్వాహకులు పాల్గొంటున్నారు. ఈసారి 29వ విజయవాడ పుస్తక మహోత్సవం(వీబీఎఫ్‌)లో 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా నగరంలోని స్వరాజ్య మైదానం(పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తక మహోత్సవంపై సదస్సు జరుగుతుంది. దీనిలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. గత ఏడాది 389 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈసారి.. గేటుకు ఎదురుగా ఉన్న ఇరుకైన ప్రాంతంలో స్టాళ్లను ఏర్పాటు చేయకుండా విశాలంగా ఉంచారు. వచ్చే సందర్శకులు సులభంగా అన్ని స్టాళ్లకూ వెళ్లాలనే ఉద్దేశంతో ఈసారి 300 స్టాళ్లకు కుదించారు. ఒకే రకమైన పుస్తకాలను విక్రయించే దుకాణాలను ఈసారి తగ్గించేశారు. పబ్లిషర్స్‌కు ప్రధానంగా  అవకాశమిచ్చి, విక్రయదారులకు ఒకే రకమైనవి విక్రయించే వారిని తగ్గించారు. జనవరి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకూ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది.

ఈసారి కూడా పుస్తక ప్రియులు కోరుకునే అన్ని రకాల పుస్తకాలూ అందుబాటులో ఉంటాయని, గతంలో కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వీబీఎఫ్‌ మీడియా కన్వీనర్‌ బాబ్జి వెల్లడించారు. పుస్తక మహోత్సవం ప్రాంగణానికి ఏటా ఒక్కో ప్రముఖుడి పేరును పెడుతుంటారు. ఈ ఏడాది సైతం పుస్తక మహోత్సవ ప్రాంగణానికి మహాలక్ష్మీ బుక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత దివంగత యు.ఎన్‌.యోగి పేరును పెట్టారు. చిత్తజల్లు వరహాలరావు(సీవీ) పేరును సాహిత్య వేదికకు పెట్టారు. సీవీ సాహిత్య వేదికపై పుస్తక ఆవిష్కరణలు, ప్రసంగాలు ఉంటాయి. ప్రదర్శన జరిగే 11 రోజులూ మధ్యాహ్నం 3గంటల నుంచి 5గంటల వరకూ ప్రముఖ రచయితలతో సమావేశాలు ఉంటాయి. ప్రముఖ తెలుగు రచయితలు ఒక్కోరోజు ఏడెనిమిది మంది చొప్పున పుస్తక మహోత్సవం సాహితీ కార్యక్రమంలో పాల్గొంటారు.

4వ తేదీన పుస్తక పఠనంపై ప్రజలకు ఆసక్తిని పెంచేందుకు వాక్‌ ఫర్‌ బుక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు వెంకట నారాయణ, ఉపాధ్యక్షులు మనోహర్‌నాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య, సంయుక్త కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి కె.రవి, సంఘం మాజీ అధ్యక్షులు, మీడియా కన్వీనర్‌ బాబ్జి, వీబీఎఫ్‌ ఇతర కార్యవర్గం నేతృత్వంలో పుస్తక మహోత్సవం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *