News

Realestate News

పుస్తక మహోత్సవం ప్రారంభం

book launch ceremony

పుస్తక మహోత్సవం ప్రారంభం
జనవరి 11 వరకు కొనసాగనున్న ప్రదర్శన నీ హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి : విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే పుస్తకాభిమానులు తరలివచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గతానికి భిన్నంగా అనేక కొత్త స్టాళ్లు సైతం ఈసారి ప్రదర్శనలో కొలువుదీరాయి. చిన్నారుల పుస్తకాల మొదలు… అన్ని రకాల సాహిత్యం అందుబాటులో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం స్టాళ్లలోని పుస్తకాలను చూసి మంచి పుస్తకాలను ఉంచారంటూ మెచ్చుకున్నారు.

జనవరి 11వ తేదీ వరకూ పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ (వీబీఎఫ్‌ఎస్‌) అధ్యక్షులు బెల్లపు బాబ్జీ వెళ్లడించారు. అన్నిరకాల పుస్తకాలూ అందుబాటులో ఉన్నాయని, కొన్ని అరుదైనవీ దొరుకుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలలో మాత్రమే దొరికే అరుదైన ప్రచురణ సంస్థలు సైతం తరలివచ్చి పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నిత్యం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ పుస్తకాల ప్రదర్శన అందరికీ అందుబాటులో ఉంటుటంది. ప్రవేశానికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరై

నా వచ్చి స్వేచ్ఛగా పుస్తకాలను చూసి వెళ్లొచ్చు. కొనుగోలు చేయాలనుకుంటే కొనొచ్చు. ప్రతి పుస్తకంపై 10శాతం ప్రత్యేక రాయితీని అందిస్తున్నారు.

ఆకట్టే కథ చెప్పే స్టాల్‌.. : పుస్తక ప్రదర్శనలో ఈసారి ఓ కొత్త స్టాల్‌ ఆకట్టుకుంటోంది. కథ చెప్పే స్టాల్‌ పేరుతో దీనిని వినూత్నంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పారు. ఒకప్పుడు ఇళ్లలో బామ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు పిల్లలకు మంచి మంచి కథలను చెప్పేవాళ్లు. చిన్నారులంతా చుట్టూ చేరి ఆసక్తిగా వినేవాళ్లు.

ప్రస్తుతం కథలు చెప్పే తాతయ్య, నాన్నమ్మల వద్ద చిన్నారులు ఉండే పరిస్థితి లేదు. కథ గొప్పతనం అంతా ఇంతా కాదని తెలియజేసేందుకు దీనిని నెలకొల్పారు. ఈ స్టాల్‌ వద్దకు వచ్చిన వాళ్లు ఎవరైనా ఏ కథ అయినా చెప్పించుకుని వినొచ్చు. దీంతో చిన్నాపెద్దా అంతా వచ్చి సరదాగా కథలు చెప్పించుకుంటున్నారు. కథను చెప్పడంలో నైపుణ్యం ఉన్న రవి అనే యువకుడు వినసొంపుగా చెపుతున్నాడు. పుస్తకాల ప్రదర్శనలో ఈ స్టాల్‌ ఆకట్టుకుంటోంది.

నాగరిక సమాజానికి ప్రతీక పుస్తక ప్రదర్శన
పుస్తక మహోత్సవ ప్రాంగణం, న్యూస్‌టుడే: నాగరిక సమాజానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు పుస్తక ప్రదర్శన ప్రతీకలుగా ఉంటాయని భాషా సమ్మాన్‌ అవార్డు గ్రహీత నాగళ్ల గురు ప్రసాదరావు అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఆదివారం నిర్వహించిన పుస్తక మహోత్సవంలో ఆయన మాట్లాడారు. గత 28 ఏళ్లుగా విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారని… విజయవాడ అభిరుచికి, సంస్కృతికి ఇది ఉత్తమ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో విష్ణు మాట్లాడుతూ..

భావితరాలకు మంచి మార్గదర్శనం చేయడం, సాంకేతిక అభివృద్ధిని సంస్కృతితో సమన్వయం చేయడంలో పుస్తకాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. సమాజంలో పుస్తకాలు, సాహిత్యానికి తగిన స్థానం లభించినప్పుడే సాంకేతిక అభివృద్ధి సద్వినియోగం అవుతుందన్నారు. పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షులు బెల్లపు బాబ్జి మాట్లాడుతూ..