News

Realestate News

భువికి దిగివచ్చిన వైభవమే దివిసీమ శతకం

భువికి దిగివచ్చిన వైభవమే దివిసీమ శతకం

ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి భువికి దిగివచ్చిన దివిసీమ వైభవమే దివిసీమ శతకమని ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన దివిసీమ శతకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. కోనసీమ, రాయలసీమలలో వినాయకుడిని ఆరాదిస్తారని, దివిసీమలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తారని చెప్పారు. ప్రేమ అనేది అందరి మీద సమానంగా ఉండాలన్నారు. స్వార్ధంతో కాకుండా ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు. కూచిపూడి నాట్యం దివిసీమకు మణిహారం అని చెప్పారు. దివిసీమలోని ప్రసిద్ధి చెందిన గ్రామాలు, మహిమలు గల పుణ్యక్షేత్రాలను, వివిధ రంగాల్లో దివిసీమకు వన్నె తెచ్చిన మహనీయుల గురించి ఈ గ్రంథంలో స్పష్టంగా వివరించారని చెప్పారు.

సీమలన్నింటిలో దివిసీమ మేలు అని చాటిచెప్పడానికి ఈ శతకం ఉపకరిస్తుందన్నారు. దివిసీమ చారిత్రకంగా అన్ని తెలుగు రాజవంశాలూ అడుగుపెట్టిన సీమ అని, సముద్రయానానికి, వ్యాపారానికి అనువైన ఈసీమపై ఆదిపత్యం కోసం జరిగిన యుద్ధాల గురించి సవివరంగా వివరించి ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. సర్వకళలకు నిలయం దివిసీమ అని, స్వాతంత్య్రోద్యమ సీమ గురించి రచయిత వివరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దివిసీమపై శతకం రాయాలని తెలుగు బంధువు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరగా ఈ గ్రంథాన్ని రచించానని చెప్పారు. దివిసీమతో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించారు. అష్టావధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్‌ మాట్లాడుతూ దివిసమ చారిత్రక విషయాలను పూర్తిగా వివరించారన్నారు.

ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ దివిసీమ చరిత్రను దశదిశలా చాటేందుకు ఈ శతకం దోహదపడుతుందన్నారు. తొలుత దివిసీమ శతకంలోని 108 పద్యాలను 108 బెలూన్లలో ముద్రించి ఆ కాశానికి అంకితం చేశారు. ఆకాశంలో రంగురంగుల బెలూన్లు ఎగురుతూ తెలుగు సాహిత్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణకు నాందిగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా యువజన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌, అమెరికా తెలుగు సంఘానికి చెందిన తోటకూర ప్రసాద్‌, ఎక్కా వెంకట్‌, వామరాజు సత్యమూర్తి (సింగపూర్‌) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *