News

Realestate News

మానవాభివృద్ధిలో జిల్లా ప్రథమం

మానవాభివృద్ధిలో జిల్లా ప్రథమం
సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ సర్వే
బాలబాలికల నిష్పత్తి వ్యత్యాసంపై ఆందోళన
ఈనాడుఅమరావతి

 

రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మానవాభివృద్ధి స్థితిగతులపై సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్‌) అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించింది. మానవాభివృద్ధిలో కృష్ణా జిల్లా ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. విద్య, వైద్యానికి పెట్టుబడులు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని గుర్తించింది. సామాజికవర్గాల వారీగా విశ్లేషించిన సెస్‌ పలు మార్గదర్శకాలను అమలుచేయాలని సూచించింది. జిల్లాలో పనిచేసేవారి కంటే వృద్ధుల శాతం పెరుగుతున్నట్లు తేల్చింది. పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోందని నివేదికలో పేర్కొంది. తలసరి వినియోగానికి, విద్య స్థితిగతులకు జిల్లాలో ఎక్కువ తేడా ఉన్న విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది.

రాష్ట్ర జనాభాలో 9.1 శాతంతో మూడోస్థానం, చదరపు కిలోమీటరుకు 518 జనసాంద్రతతో తొలిస్థానంలో జిల్లా కొనసాగుతోంది. ఏడాదికి జనాభా వృద్ధిరేటు 0.76 శాతం నమోదవుతోంది. జిల్లా జనాభాలో 19.3 శాతం ఎస్సీలు కాగా 2.9 శాతం ఎస్టీలున్నారు. జిల్లా జనాభాలో 40.8 శాతం పట్టణాల్లో ఉండగా 27.5 శాతం ప్రజలు శివారు కాలనీల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య, సౌకర్యాల పేరుతో ఉపాధి పనులు చూసుకుని పట్టణాలకు రావడానికే జనం మొగ్గుచూపుతున్నారు.

పట్టణాల్లో ఇటీవల ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఎక్కువమంది వలస వస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాకపోవడం, ప్రస్తుత యువత ప్రత్యామ్నాయ రంగాలకు వెళుతుండటంతో పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. విజయవాడతోపాటు పురపాలక పట్టణాలు అభివృద్ధి చెందడంతో సమీప గ్రామాల ప్రజలు పిల్లల చదువులు, ఇతర కారణాలతో పట్టణాలకు వస్తుండటంతో పట్టణ జనాభా క్రమంగా అధికమవుతోంది. ఫలితంగా పేదలు నివసించే శివారు కాలనీల్లో జనాభా పెరుగుతోంది.

తగ్గిపోతున్న మహిళా జనాభా
జిల్లాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి నడుమ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 992 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర సగటు నిష్పత్తి (996) కంటే ఇది తక్కువ. జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గంలో వెయ్యిమంది పురుషులకు 1001 మంది మహిళలుండగా.. ఎస్టీల్లో 985 మంది స్త్రీలే ఉన్నారు. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి 1000: 935, ఇది రాష్ట్రసగటు 944 కంటే తక్కువ కావడం గమనార్హం. బాలబాలికలు నిష్పత్తిలో ఎస్సీలు 1000 మంది బాలురకు 951 బాలికలు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ కృష్ణా జిల్లాలో ఉండటం గమనార్హం. ఎస్టీ విభాగంలో వెయ్యిమంది బాలురకు 943 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రసగటు 964 మంది కంటే జిల్లా సగటు తక్కువ.

 

పరిశ్రమలతోపాటు సేవలకు ప్రాధాన్యం
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా నుంచి 9.98 శాతం పురుషులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. 3.49 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లగా 30.4శాతం మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు ఎక్కువగా బెంగళూరు, ముంబై నగరాలకు వెళ్లారు.

జిల్లాలో తలసరి వినియోగం, ఆరోగ్యాభివృద్ధిలో వస్తున్నంతగా విద్యావ్యవస్థలో వృద్ధి లేదు.
స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 11.3 శాతం మొత్తాన్ని జిల్లా అందిస్తూ రాష్ట్రంలో ద్వితీయస్థానంలో కొనసాగుతోంది.
జిల్లా వ్యవసాయ రంగం నుంచి 13.2 శాతం, పారిశ్రామికరంగం 7.9, సేవలరంగంలో 11.8 శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అందిస్తోంది.
పనిచేసే వయసు (2559 ఏళ్లలోపు)వారి వృద్ధిరేటు 1.52 శాతం కాగా 60 ఏళ్లు పైబడిన వారి వృద్ధిరేటు 3.50 శాతం ఉండటంతో భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరగనుంది.