News

Realestate News

లక్షణంగా స్థల యోగం

లక్షణంగా  స్థల యోగం

జన్మభూమి దరఖాస్తులకు మోక్షం

క్రమబద్ధీకరణ అర్జీదారులకు అవకాశం

కార్యాచరణ దిశగా అధికారుల కసరత్తు

న్యూస్‌టుడే-కలెక్టరేట్‌

ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఓ కల. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటిల్లో మిగిలిన వాటి పరిస్థితి ఫర్వాలేదనిపిస్తున్నా, గూడు విషయంలో మాత్రం ఆశించిన లక్ష్యాలు ఎండమావులుగానే మిగులుతున్నాయి. అవసరార్థులు ఎక్కువ మంది ఉండటం.. అందుకు తగ్గ విధంగా స్థలం సమకూర్చలేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో గడచిన జన్మభూమి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటూ క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో దాదాపు లక్ష మంది వరకూ స్థల యోగం కలగనుంది. సమాజంలో అందరికి గృహయోగం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

రాష్ట్ర విభజన జరగక ముందు వరకూ పేద వర్గాలకు సంబంధించి గృహ నిర్మాణాల్లో పురోగతి ఉన్నా విభజన సమయంలో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టాక  గృహ నిర్మాణాలపై దృష్టి సారించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 16,990 ఇళ్లు మంజూరు చేశారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది లక్ష్యాన్ని కూడా కలుపుకొని స్టేట్‌ రిజర్వ్‌ కోటాతో మొత్తం 27,897 గృహాలు కేటాయించారు. మంజూరైన వాటికి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకం ద్వారా యూనిట్‌కు రూ.1.50 లక్షలు, ఎన్టీఆర్‌ గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా రూ. 2 లక్షలు ఇస్తున్న విషయం తెలిసిందే. సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే గృహ నిర్మాణాలు చేసుకొనే అవకాశం ఉంది. జిల్లాలో సొంత స్థలం లేని వారు అసంఖ్యాకంగానే ఉన్నారు. ప్రభుత్వం గృహనిర్మాణాల కోసం సహకారం అందిస్తున్నా స్థలం లేమితో సొంతగూడు ఏర్పరుచుకొనే అవకాశం లేకుండా పోతోంది. వ్యక్తిగత అవసరాలైన రేషన్‌, పింఛన్‌ల తర్వాత స్థలాల కోసం వచ్చే అర్జీల శాతమే ఎక్కువగా ఉంటోంది.

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘మీకోసం’ కార్యక్రమంతో పాటు మండలాల్లో నిర్వహించే సమావేశాలు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంగా ఇచ్చే అర్జీల్లో ఎక్కువగా ఇళ్ల స్థలాల కోసం సంబంధించే ఉంటున్నాయి. గడచిన నాలుగు విడతల జన్మభూమి గ్రామసభల్లో కూడా స్థలాల కోసం భారీ సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. అర్హులకు స్థలాలు కేటాయించే విషయంలో అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో అర్జీ పరిష్కారం విషయంలో అలసత్వం కొనసాగుతూ వస్తోంది. ప్రైవేటు భూములు కొనుగోలు చేసి పంపిణీ చేయాలనుకున్నా మార్కెట్‌ ధరకూ ప్రభుత్వం ఇచ్చే ధరకూ పొంతన లేకపోవడంతో స్థలాల సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *