News

Realestate News

శాస్త్రవేత్తలుగా ఎదిగినపుడే ప్రగతి

శాస్త్రవేత్తలుగా ఎదిగినపుడే ప్రగతి
విద్యాకేంద్రంగా అభివృద్ధి చేసుకోవడంలో అందరికృషి అవసరం
అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి రవీంద్ర

పోర్టురోడ్డు, న్యూస్‌టుడే: నిత్యం సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో భౌతిక, రసాయనశాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యాన ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ ఆఫ్‌ మెటీరియల్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ పేరిట అంతర్జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు జ్యోతిప్రకాశనం చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఎల్‌ఈడీ ఓ సంచలనంగా ఆయన అభివర్ణించారు. విప్లవాత్మకమైన మార్పులకు ఎల్‌ఈడీ శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా విద్యుత్తును ఆదా చేసుకోవడానికి ఇదో చక్కని సాధమని తెలిపారు. నానో టెక్నాలజీ ద్వారా అనేక ఉపయోగాలున్నాయన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అనేక మంది నిష్ణాతులైన ఆచార్యులు ఇక్కడికి రావడం శుభపరిణామమన్నారు. వారు చేసిన ప్రయోగాలను మనం కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరిన్ని నూతన పద్ధతులను అవలంభించి సరికొత్తగా ఆవిష్కరణలు చేసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్లే దేశవిదేశాల్లో తెలుగు ప్రజలంతా గొప్పగా రాణిస్తున్నారన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల దీనికి చక్కని ఉదాహరణ అన్నారు. ఉన్నతస్థాయిలో రాణించాలంటే ప్రపంచంలో వస్తున్న సరికొత్త మార్పులను మనం గమనించాలన్నారు. అంతర్జాతీయ స్థాయి సెమినార్‌ మచిలీపట్నంలో జరగడం బందరు స్థాయిని మరింత పెంచిందని తెలిపారు. విద్యలవాడగా విలసిల్లిన బందరును విద్యాకేంద్రంగా అభివృద్ధి చేసుకోవడంలో అందరికృషి అవసరమన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు విద్యతో, విజ్ఞానంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆచార్యులను కలుసుకోడం ముదావహమన్నారు.

విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరిన్ని నూతన ఆవిష్కరణలు ఉద్భవిస్తాయన్నారు. కాలుష్యరహిత పరిశోధనలు చేయడం ద్వారా మరిన్ని లాభాలను పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు కూడా పరిశోధన రంగంపైపు దృష్టిసారించాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యార్థులు ప్రధాన భూమిక వహించాలని కోరారు. కృష్ణా విశ్వవిద్యాలయ ప్రత్యేకాధికారి ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు మాట్లాడుతూ విజ్ఞానపరంగా సమాజం ముందడుగు వేసే విధంగా పరిశోధనలు జరపాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని నాలెడ్జ్‌హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఏపీ స్టేటü నాలెడ్జ్‌ మిషన్‌ను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు చక్కని ఉపాధిమార్గాలను చూపిస్తుండటం సంతోషదాయమని తెలిపారు. లూమినిసెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కేవీఆర్‌ మూర్తి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం దేశవిదేశాల్లో జరుగుతున్న పరిశోధనలను గురించి అవగాహన కల్పించడమేనన్నారు. అధ్యక్ష హోదాలో ప్రిన్సిపల్‌ జెస్సీమెర్సీ ఆనంద్‌ ఉపన్యసించగా, కన్వీనర్‌ మాలతీరేఖ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. జంతుశాస్త్రం, రసాయనశాస్త్రంలలో నూటికి నూరు మార్కులు సాధించిన గుమ్మడి లక్ష్మీదీపకను, హనీషాను మంత్రి, ఎంపీ తదితరులు సత్కరించారు.