News

Realestate News

65 కి.మీ… రూ.740 కోట్లు!

Bezawada four tiers - Bandar Road

65 కి.మీ… రూ.740 కోట్లు!
నాలుగు వరుసలుగా బెజవాడ – బందరు రహదారి
ముగిసిన భూసేకరణ.. మొదలైన పనులు
ఈపీసీ తరహాలో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టు
రెండేళ్లలో వినియోగంలోకి రానున్న రోడ్డు
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఈనాడు, మచిలీపట్నం

విజయవాడ నుంచి జిల్లా కేంద్రం బందరు రావాలంటే సహనానికి పెద్ద పరీక్షగా మారింది. నగరం మొదలు పామర్రు వరకు అడుగడుగునా ట్రాఫిక్‌ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. రద్దీ సమయాల్లొ అయితే బెంజి సర్కిల్‌ వద్ద నరకం కనిపిస్తోంది. దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఇకపై ఈ కష్టాలు తీరనున్నాయి. పదేళ్ల నుంచి కలగా మిగిలిన విజయవాడ – బందరు రహదారి విస్తరణ ప్రారంభమైంది. నాలుగు వరుసల రోడ్డుగా నిర్మిస్తున్నారు.

రాజధాని, మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక నడవ, సాగరమాల రాకతో ఇది కీలకంగా మారనుంది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. రెండేళ్లలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే బెజవాడకు చేరుకునే అవకాశం ఉంది. 2006 నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు.. అన్న చందంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కింది. భూసేకరణ, పరిహారం చెల్లింపు దశ దాటి పనులు మొదలయ్యాయి. ఈపీసీ విధానంలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. ఈ మార్గంలో ఓ టోల్‌గేట్‌ కూడా రానుంది.

ఎంతో కీలకం
విజయవాడ – బందరు రోడ్డు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకంగా మారనుంది. జిల్లా రాజధాని మచిలీపట్నం, ప్రధాన నగరం బెజవాడను ఇది అనుసంధానిస్తుంది. రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ కొలువుదీరాయి. పైగా విద్య, వాణిజ్య ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు బందరులో ఓడరేవు, పారిశ్రామిక నడవ మంజూరయ్యాయి. వచ్చే రెండేళ్లలో మొదటి దశ పూర్తి కానుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాగరమాల ప్రాజెక్టులో మచిలీపట్నం ప్రాంతాన్ని చేర్చారు. ఇది అమరావతికి, తెలంగాణకు దగ్గర ఓడరేవు కావడంతో ఎగుమతులు, దిగుమతులు భారీగా జరగనున్నాయి. ఆక్వాసాగు బాగా పెరిగింది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. భవిష్యత్తులో పారిశ్రామికంగా మచిలీపట్నం కీలకంగా మారనుండడంతో ఈ రహదారికి ప్రాధాన్యం పెరిగింది. ఇటీవల కాలంలో విజయవాడతో పాటు శివారు ఉయ్యూరు వరకు విపరీతంగా ట్రాఫిక్‌ పెరగడంతో 65 కి.మీ. దూరానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. రద్దీ సమయాల్లొ ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో రహదారిని నాలుగు వరసలుగా విస్తరించడం వల్ల సమయం కలసివస్తుంది. అభివృద్ధి బాగా పుంజుకునే అవకాశం ఉంది.

4 బైపాస్‌లు.. 14 కింది మార్గాలు
65 కి.మీ. నిడివి ఉండే ఈ మార్గంలో భూసేకరణ, పరిహారం చెల్లింపు దాదాపు పూర్తయింది. విజయవాడలోని బెంజిసర్కిల్‌ వద్ద మొదలై మచిలీపట్నంలో ముగుస్తుంది. ఈపీసీ తరహాలో నిర్మాణాన్ని చేపడుతున్నారు. గత ఏడాది నవంబరులో గుత్తేదారు పనులు ప్రారంభించారు. 2018, నవంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు రూ.740 కోట్లు వెచ్చించనున్నారు. కంకిపాడు సమీపంలో టోల్‌గేట్‌ను నిర్మిస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *